విజయానికి ‘వీవీఎస్‌’ మంత్రాలు

అనురక్తి, సాధన, పట్టుదల అనే మూడు గుణాలు విజయానికి మూలసూత్రాలని టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మార్గనిర్దేశకత్వం చేస్తున్న ఆయన విశాఖనగరంలోని ఓక్రిడ్జ్‌ అంతర్జాతీయ పాఠశాలను సందర్శించారు. ‘ఓక్‌ఇన్‌స్పైర్‌ఆన్‌’ టాక్‌ సిరీస్‌లో భాగంగా ఆయన విద్యార్థులకు సందేశం ఇచ్చారు. కష్టాలను ఎదుర్కొని జీవిత సాఫల్యం పొందిన వివిధ రంగాల్లోని ప్రముఖులను ఈ టాక్‌ షోకు ఆహ్వానిస్తుంటారు.

తన జీవితంలో ఏది ముఖ్యమో నిర్ణయించుకొనే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా నిర్ణయం తీసుకున్నారో వీవీఎస్‌ లక్ష్మణ్‌ విద్యార్థులకు తెలిపారు. వైద్యవిద్య అభ్యసించి వైద్యుడు అవ్వడమా లేదా తనకెంతో అనురక్తి ఉన్న క్రికెట్‌ను ఎంచకుకొని అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగడమా అనే కఠిన సందర్భం గురించి వివరించారు. ‘క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు నా తల్లిదండ్రులు ఐదేళ్లు సమయం ఇచ్చారు. నేనేంటో చూపించాలని సూచించారు. అలా చేయకుంటే ఇంటికి తిరిగొచ్చి మళ్లీ మెడిసన్ చదవాలన్నారు. నేనీ సవాల్‌ను స్వీకరించా. కఠినంగా శ్రమించా. క్రికెటర్‌ అయ్యా’ అని వీవీఎస్‌ అన్నారు.

‘అనురక్తి, సాధన, పట్టుదల’ మూడు గుణాలు సాఫల్యానికి కీలక మంత్రాలని లక్ష్మణ్‌ విద్యార్థులకు సూచించారు. విజయం సాధించిన వారికి సాధించని వారికి తేడా ఇవేనన్నారు. ‘మీరు చేస్తున్న పనిపై అమితంగా అనురక్తి ఉండటం అవసరం. అనురక్తి లేకుంటే మనం చేస్తున్న పని గుదిబండలా అనిపిస్తుంది. అదే నీకు అనురక్తి ఉంటే ఆ పనిలో ప్రతి సవాల్‌ను మీరు ఆస్వాదిస్తారు’ అని వీవీఎస్‌ అన్నారు. మ్యాచ్‌ల కోసం సిద్ధమయ్యేటప్పుడు రోజంతా గంటల తరబడి తాను సాధన చేసినట్టే చేస్తే విజయవంతం అవుతారని చిన్నారులకు సూచించారు. రోజులో కొంత భాగం సవాళ్లను ఎదుర్కోవడంపై దృష్టిపెట్టాలని విలువైన సలహా ఇచ్చారు. ఓడినవారికి, గెలిచిన వారికి ప్రధాన తేడా నిలకడ లోపమేనని వెల్లడించారు. తాము ఆదర్శంగా భావించే వీవీఎస్‌ లక్ష్మణ్‌ను చూసి ఆయనతో మాట్లాడినందుకు కొందరు విద్యార్థులు సంతోషించారు. తమ చిన్నారులతో లక్ష్మణ్‌ మాట్లాడటం అదృష్టమని విశాఖపట్నం ఓక్రిడ్జ్‌ ప్రిన్సిపల్‌ బిజు బేబీ తెలిపారు.

RELATED STORIES